Your Points
pts
Explore Mana Mangalagiri App to Earn More
Anonymous Post
This post was shared anonymously. The user has chosen to hide their identity.
Anonymous posts help users express themselves freely.
Please respect the privacy and integrity of anonymous contributors.
విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యం
నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం నా ఉపాధ్యాయులే
డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ
కలిసికట్టుగా డాన్ బాస్కో పాఠశాలను బలోపేతం చేద్దాం
మంగళగిరి డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి లోకేష్
మంగళగిరి: విద్య ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతే ముఖ్యమని, తాను ఈ స్థాయికి వచ్చానంటే కారణం ఉపాధ్యాయులే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. డాన్ బాస్కో ప్రేమ్ నివాస్ పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ తోమస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలకు అమ్మగా, నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో. పెద్దలు చెప్పినట్లు కృతజ్ఞతా భావం చాలా అవసరం. మనం గొప్ప పనులు చేయలేకపోవచ్చు.. కానీ మనం చేసే చిన్న చిన్న పనులు ప్రేమతో చేయవచ్చని మదర్ థెరిసా చెప్పారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్న డాన్ బాస్కో ప్రేమ నివాసానికి గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలకు అమ్మగా, నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో. ఇల్లు లేని వారికి ఇల్లు అయింది, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తోంది.
విద్య ఎంత అవసరమో విలువలు కూడా అంతే ముఖ్యం
విద్య ఎంత ముఖ్యమో విలువలకు కూడా అంతే ముఖ్యం. మీరు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు విలువలతో కూడిన నిర్ణయం చాలా ముఖ్యం. విజయానికి దగ్గరి దారులు ఉండవు. దానికి ఉదాహరణే డాన్ బాస్కో. ప్రేమతో అనేక సేవలు మనకు అందిస్తున్నారు. డాన్ బాస్కో 50 ఏళ్లు కాదు..వెయ్యేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకు వ్యక్తిగతంగా నేను అండగా ఉంటాను. అందుబాటులో ఉండి సాయం అందజేస్తాను. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన పాఠశాలకు మద్దతుగా నిలుస్తాం. ఇదో బాధ్యతగా మేం భావిస్తున్నాం. దివ్యాంగులకు అండగా నిలబడాలనే పవిత్ర లక్ష్యంతో డాన్ బాస్కో పాఠశాలను ప్రారంభించారు. దివ్యాంగులను సొంత పిల్లలుగా భావించారు. సేవా భావంతో వారి ప్రగతికి కృషిచేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని అందరూ అంటారు. మంగళగిరిలో 35 మంది విద్యార్థులతో డాన్ బాస్కో పాఠశాల ప్రారంభమైంది. అప్పుడే డాన్ బాస్కో ప్రేమ నివాసం అని పేరు పెట్టారు. మా అందరికీ డాన్ బాస్కో గానే తెలుసు. కానీ ప్రేమ నివాసం అనే పేరు మాకు తెలియదు. అది తెలుసుకున్న తర్వాత వారి పవిత్ర ఆలోచన అర్థమైంది. చదువుతో పాటు ప్రేమ అందించాలనే ఆలోచన గొప్పది.
నేను ఈ స్థాయికి వచ్చానంటే కారణం ఉపాధ్యాయులే
గడచిన 50 ఏళ్లుగా దివ్యాంగులను ఆదుకున్నారు. వారికి కృత్రిమ అవయవాలు అందించారు. దివ్యాంగులకు కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎలా జీవించాలో నేర్పారు. తెలుగు మీడియం పాఠశాలలో సుమారు 350 మంది విద్యార్థులు ఉన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దై మూడేళ్లు అయిందని, తమను ఆదుకోవాలని గతంలోనే మీరు కోరారు. విద్యాశాఖ మంత్రిగా నేను ఆ బాధ్యతను స్వీకరిస్తానని హామీ ఇస్తున్నా. చదువుకునేప్పుడు మనం ఎక్కువ సమయం ఉపాధ్యాయులతోనే గడుపుతాం. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులే. మంజులా మేడమ్, నారాయణ గారు, రాజిరెడ్డి గారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా ఉపాధ్యాయులను, మీకు విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలను మర్చిపోవద్దు. పాఠశాలకు సాయం అందించాలి. ఇక్కడున్న టీచర్లందరికీ నా హ్యాట్సాఫ్. మీకు మేం అండగా నిలబడతాం.
కలిసికట్టుగా డాన్ బాస్కో పాఠశాలను బలోపేతం చేద్దాం
1972లో ఫాదర్ తోమస్ చిన్నప్ప గారు సమాజాన్ని వేరే కోణంలో చూశారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో వికలాంగ బాలుడిని చూసి కేవలం అతడిని రక్షించడమే కాకుండా.. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయం ఉద్యమంలా మారింది. కరుణ, మానవత్వం, ధైర్యాన్ని ఆయన మనకు అందించారు. ఆయనకు మనం కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత మనపై ఉంది. సమాజంలో ఉన్న అన్ని సమస్యలను ఒక వ్యక్తి, వ్యవస్థ తీర్చలేదు. అందరం కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనం ఆశించిన మార్పు సాధ్యమవుతుంది. గడచిన 50 ఏళ్లలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నేను ఎప్పుడు సాయం కోరినా మీరు నాకు అండగా నిలిచారు. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. బాధ్యతను నా భుజస్కందాలపై మోస్తాను. కలిసికట్టుగా ఈ పాఠశాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశంలోనే అద్భుతమైన పాఠశాలగా తీర్చిదిద్దుదాం. ఏ పవిత్ర లక్ష్యంతో ఈ పాఠశాల ప్రారంభమైందో దానిని కలిసికట్టుగా ముందుకు తీసుకెళదామని మంత్రి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.